ప్రతీ సంగీత ప్రియుడి హృదయాలు చేరిన సంగీత దర్శకులు మణి శర్మ గారు. ఆయన స్థానం ప్రత్యేకం. ఆయన స్థాయి పదిలం. ఈయన పాట అంటూ తెలియని తెలుగు వాడు ఉండడు. 20 ఏళ్ల కు పైగా ఏకఛత్రాధిపత్యం తెలుగు సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలిన సంగీత సామ్రాజ్య రారాజు మణి శర్మ గారు.
ఆయనను తెలుగు వారు ఆప్యాయం గా, ప్రేమ గా “మెలోడీ బ్రహ్మ”, “స్వర బ్రహ్మ” అని పిలుచుకుంటారు.
ఆయన చేయనటువంటి సంగీత ప్రక్రియ లేదు. ఆయన చేయని ప్రయోగం లేదు. ఆయన ని ప్రేమించని వ్యక్తి లేడు. ఇప్పటికీ ఆయన పాటలు chartbusters గానే ఉంటాయి. ఎన్ని పాటలని చెప్తాం ఆయన ప్రస్తావన వస్తే? కనీసం మన మది లో ఇప్పటికిప్పుడు 60 పైగా మధురమైన, మాస్, క్లాస్, క్లాసికల్ పాటలు మెదుల్తాయి. మాద్యమాలలో ఇప్పటికీ మనం చూస్తూ ఉంటాం, “మణి శర్మ” గారి పాట వినని రోజు లేదని.
పొద్దున జాగింగ్ లో ఆయన మెలొడీ పాట. ఆఫీస్ కు వెళ్తూ ఆయన పాట. డ్రైవింగ్ లో ఆయన మెలొడీ పాట. పని చేసేటప్పుడు ఆయన పాట. బాధ కలిగితే ఆయన పాట. ఉత్సాహం లో ఆయన పాట. ఎప్పుడూ ఆయన పాట వెతుక్కొని మరీ వింటాం. అదీ మనకు ఆయన పాట మీదున్న ప్రేమ.
మణి గారు తక్కువ మాట్లాడతారు. ఎక్కువ పని చేస్తారు. బయటకు రారు. తెర వెనక నుండే తన స్వరాల రూపం లో వినిపిస్తారు. కనీసం తన గొంతు తను స్వరపరిచిన స్వరాల ద్వారా కూడా వినపడేది కాదు. కానీ తెలుగు సినీ సంగీత ప్రజల అదృష్టం ఏంటంటే ఈమధ్య శర్మ గారు కొంచం ఇంటర్వ్యూలకు వస్తున్నారు. మాట్లాడుతున్నారు. అది నిజం గా మన అదృష్టం.
ఎప్పటికీ ఇళయరాజా శిష్యుడినే అని చెప్పుకునే శర్మ గారు, తన సమకాలీనులైన రెహ్మాన్ గురించీ ఎంత మక్కువ గా మాట్లాడరో, తన శిష్యులైన థమన్, దేవిశ్రీప్రసాద్, హేరిస్ జైరాజ్ గురించీ అంతే ప్రేమ గా మాట్లాడతారు.
మెలోడీ అంటేనే మణి శర్మ గారనీ, మెలోడీ బ్రహ్మ గా ఆయన స్థానం ఎప్పటికీ ఎన్నటికీ చిరస్థాయి గా నిలుస్తుందనీ, ఇంకా రాబోయే 30 ఏళ్లు ఆయన సంగీత సరస్వతి సేవలో నిమజ్ఞమై మనకు ఎనలేని పాటలను అందిస్తారని ఆశిద్దాం.
మన తెలుగు సినీ సంగీత దర్శక దిగ్గజం ఐన మణిశర్మ గారి కి ఆ పరమ శివుడు ఎనలేని ఆయురారోగ్యాలనూ, విజయాలనూ, ఉన్నత స్థానాలను ప్రసాదించాలని కోరుకుందాం.