చంద్రబాబు: విగ్రహాల జోలికొస్తే తాట తీస్తా

రాష్ట్రంలో రాజకీయ నేతల విగ్రహాలను కూలదోయడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు: విగ్రహాల జోలికొస్తే తాట తీస్తా

రాష్ట్రంలో రాజకీయ నేతల విగ్రహాలను కూలదోయడంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల జోలికి వస్తే తాట తీస్తానని హెచ్చరించారు. పార్టీల పరంగా విమర్శలు చేయాలి కానీ దివంగత నేతల విగ్రహాల విషయంలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? అని విపక్ష పార్టీల నాయకులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా శనివారం ఉదయం కృష్ణాజిల్లాలోని కైకలూరులో ఇటీవలి ఏర్పాటు చేసిన కాపు నాయకుడు వంగవీటి రంగా విగ్రహాన్ని కొందరు దుండగులు కూలదోశారు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు నిందితులను 24 గంటల్లోగా గుర్తించాలని పోలీసులను ఆదేశించారు. ఏ పార్టీకి చెందిన వారి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టరాదని కూడా ఆదేశించారు. నేతలు ఏం చేశారు? అని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రశ్నించారు. నేతల విగ్రహాలు ఏవైనా అవమానించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం చంద్రబాబు కాకినాడ పర్యటనకు వెళ్లారు.

ప్రతి నెలా చివరి శనివారం స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలో చంద్రబాబు పర్యటించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎంపిక చేసిన ప్రాంతంలో చీపురు పట్టుకుని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పలువురి నుంచి ఆయన వినతిపత్రాలు స్వీకరించారు. రాష్ట్రాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దే క్రమంలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

చెత్త నుంచి సంపద సృష్టించవచ్చన్న తన వాదనను కేంద్రం ఇటీవలి కాలంలో నిరూపించిందన్నారు. ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రారంభించిన ఓ ప్రాజెక్టుకు చెత్తను వినియోగించారని ఆయన తెలిపారు. సుమారు వెయ్యి టన్నుల చెత్తను బ్రిడ్జి నిర్మాణంలో ఉపయోగించడం ద్వారా రాజధాని ఢిల్లీలో చెత్త సమస్యను తగ్గించారని చెప్పారు. అదే విధానాన్ని ఏపీ ఎప్పుడో ప్రారంభించిందని, అయితే ప్రభుత్వం మారడంతో అన్ని అస్తవ్యస్తమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రతి నగరంలోనూ చెత్త నుంచి సంపద సృష్టించే కేంద్రాలను ప్రోత్సహించనున్నట్టు తెలిపారు.